అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో భక్తుడిగా నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ హీరో నాగార్జున తొలిసారి భగవంతుడిగా దర్శనమివ్వబోతున్న చిత్రం ‘శిరిడి సాయి’. నాగ్‌ని భక్తుడిగా మలిచిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రంలో ఆయన్ను సాయిబాబాగా మలుస్తున్నారు. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి సులోచనారెడ్డి సమర్పణలో పారిశ్రామికవేత్త ఎ.మహేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల చిత్రసంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆధ్వర్యంలో పాటలను రికార్డ్ చేశారు. వచ్చే నెల 2న కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించి 25 రోజుల పాటు జరుపనున్నారు. ఇదిలా వుండగా, గురువారం ఈ చిత్రం ‘ఫస్ట్ లుక్’ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రవిశేషాలను నాగార్జున తెలియజేస్తూ -‘‘అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో భక్తుడిగా నటించిన నాకు ఈ చిత్రంలో శిరిడి సాయి పాత్ర పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నాకు ఓ మరపురాని చిత్రం అవుతుంది. రాఘవేంద్రరావుగారితో చేస్తున్న మరో గొప్ప భక్తిరసాత్మక చిత్రం ఇది. సాయిబాబా భక్తులైన మహేష్‌రెడ్డిగారు ఎంతో అభిరుచితో, భక్తితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కథాసంకలనం: భక్త సురేష్ డి., కథాసహకారం: పొందూరి హనుమంతరావు, ఫొటోగ్రఫి: ఎస్.గోపాల్‌రెడ్డి, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, వేదవ్యాస్, సత్తిపండు, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్. |
0 comments:
Post a Comment