Friday

మా అందరికీ కొత్త సంవత్సరం గిఫ్ట్ రగడ


‘‘నాగార్జునగారికి, మాకు ఇది ‘సిల్వర్ జూబ్లి’ ఇయర్ కాబట్టి తీపి గుర్తుగా నిలిచిపోయే సినిమా చేయాలనే పట్టుదలతో ‘రగడ’ చేశాం. మేం ఆశించినదానికన్నా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు డి.శివప్రసాద్‌రెడ్డి.

నాగార్జున హీరోగా కామాక్షి మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన ‘రగడ’ గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైంది. వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున సరసన అనుష్క, ప్రియమణి నాయికలుగా నటించారు.

13 రోజులకు 19 కోట్ల 17 లక్షల రూపాయలు వసూలు చేసిందని, గుంటూరులో కోటికి పైన, నైజాంలో 5 కోట్ల 13 లక్షలు వసూలు చేసి ‘రగడ’ విజయపథంలో దూసుకెళుతోందని గురువారం పాత్రికేయుల సమావేశంలో శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. మరిన్ని విశేషాలను ఆయన చెబుతూ -‘‘పంపిణీదారులందరికీ ఈ చిత్రాన్ని సంతృప్తినిస్తోంది. ఇక్కడే కాదు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. మా సంస్థకు కొత్త సంవత్సరం సందర్భంగా ‘రగడ’ మంచి బహుమతి అయ్యింది.

ఇంకా చెప్పాలంటే మాకు ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌లా నిలిచింది. ఇప్పటివరకు పైరసీని అరికట్టడానికి మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. ‘ఆన్‌లైన్’ పైరసీని చాలావరకు అరికట్టగలుగుతున్నాం. కానీ సీడీలను మాత్రం అడ్డుకోలేకపోతున్నాం. నాగార్జునగారితో మాస్ సినిమాలు చేయడానికే నేను ఇష్టపడతాను. కొంత గ్యాప్ తర్వాత ఆయన చేసిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఫిలిం కావడంవల్ల, కథ, కథనాలు, ఆడియో.. బాగుండటంవల్ల ఈ చిత్రం ఇంతటి ఘనవిజయాన్ని సాధించింది. మేం అనుకున్న బడ్జెట్‌లోనే ఈ చిత్రాన్ని తియ్యగలిగాం. వీరు పోట్ల నిర్మాతల దర్శకుడు’’ అన్నారు.

నాగార్జునతోనే వరుసగా సినిమాలు తీయడం గురించి ఆయన్ని ప్రశ్నిస్తే - ‘‘మా మధ్య ప్రేమాభిమానాలు తప్ప ఎలాంటి ఒప్పందాలు లేవు. మాకు నాగార్జునగారితో సినిమా తీయడం సౌకర్యవంతంగా ఉంటుంది. ఆయన కూడా మా బేనర్‌ని సొంత బేనర్‌లా భావిస్తారు కాబట్టి ఇష్టపడి చేస్తారు. మళ్లీ నాగార్జునగారితో సినిమా ప్లాన్ చేస్తున్నాం. అది కూడా మాస్ ఫిల్మే’’ అన్నారు.
SAKSHI SOURCE 

0 comments:

Post a Comment