పదవులు శాశ్వతం కాదని, అందువల్ల తనను మంత్రి పదవి నుంచి తొలగించినా తనకెలాంటి బాధ లేదని రాష్ట్ర గనుల శాఖామంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అందువల్ల ఆరు నూరైనా తాను కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని తేల్చి చెప్పారు.
వచ్చే నెల మూడో తేదీన జగన్ చేపట్టే ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని, ఏర్పాట్లు చేయవద్దని అధిష్టానం మాటగా చెపుతున్నట్టు ముఖ్యమంత్రి రోశయ్యకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి గురువారం ఫోన్ చేసి చెప్పారు. ఈ మాట తనది కాదని, అహ్మద్ పటేల్ మాటగా చెపుతున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి మాటలతో బాలినేని విభేదించినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాధారణ గల నేత, తన బంధువైన జగన్ తన జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తే వెళ్లలేకుండా ఉండలేనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ పరంగా యాత్ర చేయాలన్న అధిష్టానం నిర్ణయం తనకు తెలియదన్నారు. ఈ విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాత జగన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని బాలినేని తెలిపారు.
పదవులు శాశ్వతం కాదన్నారు. స్నేహం, బంధుత్వాలు ముఖ్యమన్నారు. అందువల్ల ఓదార్పు యాత్రలో పాల్గొని తీరుతానన్నారు. తద్వారా తన మంత్రి పదవి పోయినా పర్వాలేదన్నారు. అదే సమయంలో తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని బాలినేని స్పష్టం చేశారు
0 comments:
Post a Comment