Monday

రెండు పిల్లుల మధ్య "కోతి" చిరంజీవి: జీవిత - రాజశేఖర్

ఫిలిమ్ ఛాంబర్ వేదికగా జీవిత - రాజశేఖర్‌లు దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుకుంటుంటే "రెండు పిల్లుల మధ్య కోతి"లా జొరబడి పబ్బం గడుపుకోవాలనే కుటిల ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. కోటిమంది చిరంజీవులు ఏకమై వచ్చినా కాంగ్రెస్ పార్టీ మధ్య చిచ్చుపెట్టలేరని అన్నారు. సినీ ఇండస్ట్రీలో చేసిన రాజకీయాలనే మళ్లీ ఇప్పుడు రాజకీయాల్లోనూ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. మార్పు తెస్తానంటూ పార్టీ స్థాపించిన చిరంజీవి ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్నటి ఉపఎన్నికల్లో అభ్యర్థులు సైతం దొరకని చిరంజీవి, కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టి ఏదోవిధంగా కాంగ్రెస్‌లో దూరిపోయి మంత్రి పదవి కొట్టేసి కోట్లు సంపాదించాలని చూస్తున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్లను అమ్ముకున్న చిరంజీవి మరోసారి స్థానిక సంస్థల్లో దోచుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. భారీ మోసాలకు పాల్పడిన చిరంజీవికి జగన్‌ను విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయనకు ప్రజల్లో ఉన్న శక్తి ఏమిటో తెలిసిపోయిందనీ, ఆ తర్వాత పార్టీ మూసుకునే దశకు చేరుకునేసరికి ఇపుడు కాంగ్రెస్ గూటికి చేరుకోవాలని చూస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే సోనియాగాంధీకి చెవెమ్మట జోరీగలా ఫోన్ చేసి ఆమె అపాయింట్‌మెంట్ సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు. మనుషులను అద్దెకు తెచ్చుకుని ప్రస్తుతం ఆయన చేస్తున్న చైతన్య యాత్రలు పసలేనివని అన్నారు. ప్రజలు పిచ్చోళ్లు కాదనీ, అన్నీ గమనిస్తూనే ఉంటారనీ, సమయం వచ్చినప్పుడు ఎవరికి ఎలా వాత పెట్టాలో అలాగే పెడతారన్నారు.

0 comments:

Post a Comment