Thursday

అదే ప్రేమ.. ఆప్యాయతలు: జనసంద్రంగా ఇడుపులపాయ!





అభిమానానికి అడ్డుకట్ట వేయగలమా.? ప్రేమకు విలువ కట్టగలమా..? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యం. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేసి హఠాన్మరణం పాలైన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల రాష్ట్ర ప్రజానీకం చూపిస్తున్న అభిమానం ఆదరణ కూడా అలానే ఉంది. ఇప్పటికీ.. కించిత్ తగ్గలేదు. ఆయన భౌతికంగా దూరమై సరిగ్గా యేడాది గడిచినా.. మహానేత పట్ల రాష్ట్ర ప్రజలు చూపుతున్న.. చూపిస్తున్న... ప్రేమ, అభిమానం తరగలేదు కదా మరింతగా పెరిగినట్టుగా కనిపిస్తోంది. 
ఎందుకంటే.. ఆయన చేసిన ప్రజాసేవ. ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నారని ఘంటాపథంగా చెప్పొచ్చు. పేదోడికి కడుపునిండా ఒక పూట పట్టెడన్నం లభించాలన్న ఉద్దేశ్యంతో కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని పంపిణీ చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరుతో నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రీయంబర్స్‌మెంట్ చేసి విద్యాదాతగా పేరు గడించారు. 
రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా, కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేయించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చాలని రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో పక్కా ఇళ్లను కట్టించి ఇచ్చారు. ఆపదలో ఉన్న సమయంలో ఆదుకునేందుకు 104, 108 సర్వీసులను పల్లెప్రాంతాల్లో తిరిగేలా చేశారు. 
జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి హరితాంధ్రప్రదేశ్‌గా మార్చాలని ప్రయత్నించారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందివ్వాలన్న లక్ష్యమే కాకుండా మరో రెండు కోట్ల మందికి తాగు నీరు ఇవ్వాలని భావించారు. అక్కాచెల్లెళ్లను లక్షాధికారులను చేయాలన్న తలంపుతో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించారు. 
పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో నెలసరి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇలా.. ఎన్నో జనాకర్షక పథకాలు చేపట్టటం వల్లే వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. ఫలితంగా ఆయన పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ఏమాత్రం చెక్కుచెదరకుండా నిలిచి పోయాయి. 
అందుకే.. ఆయన జీవించి ఉన్నప్పుడు లేదా తుదిశ్వాస విడిచినపుడు చూపించిన ప్రేమాభిమానాలనే రాష్ట్ర ప్రజానీకం ఇప్పటికీ చూపిస్తోంది. వైఎస్ భౌతికంగా లేడన్న విషయమే గానీ.. ఆయన చేసిన సేవలు, ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజల మధ్యలో వైఎస్ఆర్ జీవించే ఉన్నారని చెప్పొచ్చు. 
అందుకే.. తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పించాలని ప్రతి ఒక్కరూ ఇడుపులపాయవైపు అడుగులు వేశారు. ఇలా.. ఒక్కో అడుగు పడటంతో ఇపుడుపులపాయ మరోమారు జనసంద్రాన్ని తలపించింది. వేల సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో వైఎస్ఆర్ ఘాట్ కిక్కిరిసి పోయింది. 
చిన్నాపెద్దా.. ముసలి ముతక ఇలా ఒకరేంటి అంగవికలురు సైతం వైఎస్‌ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అశేష ప్రజలు వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. ఇడుపులపాయకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన తనయుడు వైఎస్.జగన్ అన్నదానం చేసి తనలోని ఉదారగుణాన్ని చాటుకున్నారు.

0 comments:

Post a Comment