Sunday

తెలంగాణవాదులకు కౌంటర్లు మొదలుపెట్టాల్సిందే: సీమాంధ్ర

లక్ష్య సాధనను పక్కన పెట్టి తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్ర ప్రాంతవాసులను బెదిరించమే వేర్పాటువాదుల (తెలంగాణ) ప్రధాన అజెండాగా ఉందని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పంథాను అనుసరిస్తామని తెలంగాణవాదులు ప్రకటిస్తే.. తాము కూడా ఇందుకు సిద్ధమని ప్రకటించారు. డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో కృత్రిమ భూకంపం, కృత్రిమ యుద్ధం సృష్టిస్తామని హెచ్చరికలు చేస్తున్న తెరాస అధినేత కేసీఆర్, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ల తీరుపై సీమాంధ్ర నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండి రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే తాము ప్రతిదానికీ శాంతిమంత్రాన్ని పఠిస్తున్నట్టు చెప్పారు. వారు యుద్ధానికి సై అంటే మేమూ సిద్ధమేనని సీమాంధ్ర నేతలు ప్రకటించారు. ప్రభుత్వ చీప్ విఫ్ శైలజానాథ్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయిన విషయం తెల్సిందే. ఈ సమావేశంలో వేర్పాటువాదుల ఆగడాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. హైదరాబాద్‌లోనే కాకుండా, తెలంగాణ జిల్లాల్లో నివశిస్తున్న సీమాంధ్రులను భయభ్రాంతులకు గురి చేయడమే కేసీఆర్, కోదండరామ్‌ల లక్ష్యంగా ఉందన్నారు. ఇందుకోసం వారు ఉస్మానియా విద్యార్థి జేఏసీని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంతం వారిపై ఆధిపత్యం చెలాయించడానికి వారు ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణవాదం పేరిట రాష్ట్రంలో పౌర హక్కులతో పాటు.. రాజ్యాంగ పాలనకు తీవ్ర విఘాతం కలుగుతుందని సీమాంధ్ర నేతలు అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థపైనే దాడులు చేసి.. తిరిగి సమర్థించుకునేలా బరితెగించి పోయారని వారు ధ్వజమెత్తారు. తెలంగాణ అంశ పరిష్కారానికి కేంద్రం జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. అలాకాకుండా కృత్రిమ యద్ధానికి తెరాస నేతలు సిద్ధపడితే తాము కూడా సిద్ధమవుతామనీ, అమీతుమీ తేల్చుకుంటామని వారు తీర్మానించారు. ఇప్పటి వరకు ఎంతో ఓపిక, సహనాన్ని పాటిస్తున్నాం. ఇకపై భరించే పరిస్థితిలేదు. వేర్పాటువాటులకు కౌంటర్లు మొదలు పెట్టాల్సిందేనని రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒక ప్రతిపాదన చేయగా, మిగిలిన ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపారు.

0 comments:

Post a Comment